Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రోగులను మా ఆసుపత్రిలో చేర్పించండి... మీరు హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేయండి!: ఆసుపత్రి బంపర్ ఆఫర్

వ్యాపారం దినదినాభివృద్ధి చెందేందుకు వ్యాపార సంస్థలు వినూత్న ప్రచారాలు నిర్వహిస్తుంటాయి. కానీ బీహార్‌ లో హజీపూర్‌ లోని న్యూ బి.కె. హాస్పిటల్‌ సూపర్ వింటర్ ఢమాకా పేరుతో వినూత్న ప్రచారం నిర్వహించి అందర్నీ షాక్ కు గురిచేస్తోంది. తమ హాస్పిటల్ కు వైద్యానికి రోగులను తీసుకొచ్చిన వారికి ఉచిత హాలీడే ట్రిప్ ఇస్తామని ఆఫర్ ఇస్తోంది. తమ ఆసుపత్రిలో చేర్చే రోగుల సంఖ్యను బట్టి 5 రకాల ప్యాకేజీలున్నాయని పేర్కొంటూ కరపత్రాలు కూడా పంచింది. ఈ కరపత్రాల్లో ఉన్న వివరాలను బట్టి న్యూ బి.కె ఆసుపత్రిలో 5 నుంచి 15 మంది పేషెంట్లను తీసుకువచ్చి జాయిన్ చేసేవారికి, రాంచి, రాజ్రప్ప, దేవ్‌ ఘడ్‌, షిర్డీ, జమ్మూ, వైష్ణోదేవి, వారణాసి, వింధ్యాచల్‌ తదితర ప్రాంతాలకు రెండు నుంచి ఐదు రోజులు ప్యాకేజీలు ప్రకటించింది. ఈ స్కీమ్ కేవలం అక్టోబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 15 వరకు రోగులను తీసుకువచ్చి తమ ఆసుపత్రిలో చేర్చిన వారికి మాత్రమే వర్తిస్తాయని ఆ ఆసుపత్రి తెలిపింది. ప్యాకేజీలో హాలీడేకు వెళ్లేవారు డిసెంబర్‌ చివరి వారంలో లేదా జనవరి మొదటి వారంలో హాలీడేకు వెళ్లాలని పేర్కొన్నారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో, తమ ఆసుపత్రి పేరును చెడగొట్టేందుకు ఎవరో కుట్రపన్నారని ఆ ఆసుపత్రి తాజాగా ప్రకటించడం కొసమెరుపు.

More Telugu News